DWCRA, మెప్మా మహిళలకు బంపర్ గుడ్ న్యూస్: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు! | Bumper Offer To AP DWCRA Womens Cm Chandrababu Key decissions
డ్వాక్రా, మెప్మా మహిళలకు భారీ గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
అమరావతి, అక్టోబర్ 21: రాష్ట్రంలో మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ చేపడుతోంది. మంగళవారం సచివాలయంలో జరిగిన సెర్ప్ (SERP), మెప్మా (MEPMA) విభాగాల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని, మహిళల ఆర్థికాభివృద్ధి, వ్యాపారావకాశాల విస్తరణ, మరియు పారిశ్రామిక శిక్షణపై అనేక కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా, DWCRA మహిళలు మరియు మెప్మా గ్రూపులకు శుభవార్త చెప్పడం జరిగింది.
పొదుపు నుంచి పారిశ్రామికవేత్తల వైపు పయనం!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేవలం పొదుపు సంఘాల (Self-Help Groups) స్థాయిలో కాకుండా, DWCRA మహిళలును ఇప్పుడు పూర్తిస్థాయి వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు ఇప్పటివరకు ఏకంగా రూ.20,739 కోట్లను పొదుపుగా ఉంచగలిగాయని, అంతేకాక దానికి రెట్టింపు మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా (బ్యాంకు లింకేజీ) పొందగలిగిన స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమన్నారు. ముఖ్యంగా, తీసుకున్న బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించడంలో 99 శాతం పైగా మహిళలు క్రమశిక్షణ పాటించడం నిజంగా గర్వకారణమని సీఎం అభినందనలు తెలిపారు. ఈ విజయమే వారిపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది.
కొత్త ప్రణాళికలు, క్లస్టర్ల ఏర్పాటు, వేగవంతమైన రుణాలు
DWCRA మరియు మెప్మా కార్యకలాపాలను సమన్వయం చేయడం ద్వారా మరింత సమర్థత సాధించవచ్చని సీఎం సూచించారు. మహిళల పొదుపులు, రుణాల వినియోగంపై స్పష్టమైన మార్గనిర్దేశం చేసేందుకు ఒక ప్రత్యేకమైన ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇది మహిళల ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకతను పెంచుతుంది. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉత్పత్తి చేసే వస్తువుల ఆధారంగా ఏకంగా 100 క్లస్టర్లను ఏర్పాటు చేసి, వాటికి మార్కెటింగ్, బ్రాండింగ్ సదుపాయాలను ప్రభుత్వం కల్పించబోతోంది. ఇది వారి ఉత్పత్తులకు భారీ డిమాండ్‌ను సృష్టించే అవకాశం ఉంది.
బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియ మరింత వేగవంతం కావాలని సీఎం ఆదేశించారు. “గంటల్లోనే రుణాలు అందించాలన్న బ్యాంకర్ల హామీ అమలవుతున్నదో లేదో అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించాలి” అని సూచించారు. DWCRA మహిళలు ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ అవకాశాలను కల్పించాలని, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఆక్వా, టూరిజం వంటి రంగాల్లో ప్రత్యేక మార్కెట్ సృష్టించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
సాంకేతికతతో అడుగులు, సరికొత్త వ్యాపార ఆలోచనలు
DWCRA మహిళలు మరియు మెప్మా సభ్యుల్లోని నైపుణ్యాన్ని ఉపయోగించుకునేందుకు సీఎం అనేక కొత్త ఆలోచనలను ప్రతిపాదించారు. ముఖ్యంగా, అరకు కాఫీ, మిల్లెట్ల ఉత్పత్తుల ఆధారంగా ప్రఖ్యాత “స్టార్ బక్స్” తరహాలో అవుట్ లెట్లను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆహ్వానించదగినది. మునగాకు, సీవీడ్ వంటి స్థానిక ఉత్పత్తుల ఆధారంగా కొత్త వ్యాపార నమూనాలను రూపొందించాలని, రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం, ఆక్వా కార్ట్, మిల్లెట్ కార్ట్ వంటి ప్రయోగాలను ప్రవేశపెట్టాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలలో ఉన్న పీహెచ్డీ మహిళలను గుర్తించి, వారి నైపుణ్యాన్ని రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో వినియోగించుకోవాలని సూచించడం విశేషం.
సమీక్ష ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు గారు “మెప్మా–మన మిత్ర” యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా మెప్మా కార్యకలాపాలకు సంబంధించిన ఎనిమిది రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. అదనంగా, DWCRA మహిళలు మరియు మెప్మా సభ్యులకు వర్చువల్ శిక్షణ అందించేందుకు “ప్రగ్న్యా యాప్” కూడా అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి ప్రాంతానికి చెందిన ఒక మహిళ రూ.1.25 కోట్లతో వ్యాపారం ప్రారంభించడంపై సీఎం ఆమెను అభినందించారు. ఈ నిర్ణయాలన్నీ రాష్ట్రంలో మహిళా సాధికారతకు కొత్త దిశానిర్దేశం చేస్తాయని చెప్పొచ్చు.